Sri Laxmihrudayamu    Chapters   

మండలి మాట

పూర్వులగు మహర్షులు ఐహికములు-ఆముష్మికములునగు సకలసుఖములను బడయుటకు ఆయాస రహితముగాఁ బయనింపదఁగిన వెలుఁగు బాటల నెన్నిటినో యనుగ్రహించిరి. ఈ మానవుని తెలివి యేమోకాని వాఁడా బాటలయందుఁ బయనింపఁడు. సుఖములేదనను; లేమి తన్ను వరించినదనను; అర్థకామములకై యంగలార్చును. ఇట్టివారిని గూర్చి వ్యాసుఁడు భారతమునందిట్లు వాపోయెను.

శ్లో|| ఊర్ధ్వబాహుర్విరౌమ్యేష నచకశ్చిత్‌ శృణోతిమే.

ధర్మాదర్థశ్చ కామశ్చ సధర్మః కిం న సేవ్యతే||

"ధర్మచరణమువలన అర్థకామములు ఫలించును. ధర్మమునాచరింపవేల?" అని నేను చేతులెత్తి మొఱవెట్టు చున్నాను. కాని నామాటల నొక్కడు నాలకింపఁడు.

ఇది లక్ష్మీ హృదయము. తత్త్వమెఱిఁగి యుపాసించు వారల కిది తఱుఁగని సిరులనుఁబసాదించును. దీని యుపాసనము ధర్మాచరణమై అర్థకామములనే కాక మోక్షమును గూడ ఫలింపఁజేయు ననుటలో సందియము లేదు. దీనికఁదెనుఁగున వివృతిరచించిన బ్రహ్మశ్రీ ఈశ్వర సత్యనారాయణ శర్మగారి పాండిత్యము లోక విశ్రుతము. మంత్రశాస్త్రములోని మర్మములను వారివలె వివరింపఁగల విద్వాంసు లాంధ్ర దేశమునం దన్యులు కానరారనుట యతిశయో క్తికాదు. వారి యొక్క యీ లక్ష్మీ హృదయ వివరణము సాధకున కుదయించు సకలసందేహములను దొలగింపఁగలదగుటయే కాక, ఇట్టివానియందు స్థిరవిశ్వాసము లేనివారియందు విశ్వాసమును బాదుకొలిపి వారికిఁ గూడ వెలుఁగుముద్దయైన యమ్మ నెఱింగింపఁగల్గియున్నది. వారి యీపంక్తులను జూడుఁడు.

(176వ పేజీలోని"......దోషములు కారణముగా-అన్నది మొదలు .....ఇంతలో నంతరించి పోవుచున్నది." అన్నంతవరకు గల పేరా.)

ఇట్లు లలితము, అర్థవంతము, సర్వసంశయవిచ్ఛేదమునగు శైలిలో రచింపఁబడిన యీ గ్రంథము సాధకపాఠకులకు మిక్కిలి యుపకరింపఁగలదు. ఇట్టి యుత్తమగ్రంథమును మా మండలి కనుగ్రహించిన శ్రీ శర్మగారి నేమనిప్రస్తుతింపగలము! మామండలి మనుగడకు శ్రీ శర్మగారు ఆధార స్తంభము. ఇంత వరకు శ్రీ శ్రమగారి రచనలనేకములు ఫలాపేక్షరహితముగా సర్వస్వామ్యములతో ప్రచురించుట కంగీకరించి యనుగ్రహించుటయేగాక ముద్రణవ్యయమును గూడ యధావకాశముగా భరించుచున్న పితృతుల్యులగు శ్రీశర్మగారికి యనేక ధన్యవాదము లర్పించుచున్నాను. లోకోపకారములగు నిట్టి గ్రంథముల ననేకములను రచించుటకుఁదగినయారోగ్య భాగ్యమును వారికిఁ బ్రసాదింపుమని వారెఱిగించిన యమ్మ యెదుటనే దోయిలించుచున్నాను.

సాధకపాఠకలోకము చిరకాలముగా గోరుచు నిరీక్షించుచున్న "సౌందర్యలహరి" శ్రీ శర్మగారి వివరణతో "ఆనందలహరి" తో మండలిలో నచిరకాలమున వెలువడనున్న దని చెప్పుట కెంతయు సంతసించుచున్నాము.

తెనాలి} ఇట్లు

27-9-67 బులుసు సూర్యప్రకాశశాస్త్రి

వ్యవస్థాపకుడు: సాధన గ్రంధమండలి.

Sri Laxmihrudayamu    Chapters